దేశీయ మొబైల్ మార్కెట్‌లో దూసుకుపోతోన్న Xiaomi 14 Ultra మోడల్‌కు కొనసాగింపుగా Xiaomi 15 Ultraను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పరిచయం చేయబోతున్నారట. అయితే, అందుకు సంబంధించిన ఎలాంటి విషయాలను బయటకు వెల్లడించలేదు ఈ చైనీస్ టెక్ బ్రాండ్. కానీ Xiaomi లాంచ్ చేయబోయే మోడల్ స్పెసిఫికేషన్‌ల గురించి లీక్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. Xiaomi 14 Ultra మాదిరిగానే రాబోయే Xiaomi 15 Ultra వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇది Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందే అవకాశం ఉంది.
ఖచ్చితంగా అప్‌గ్రేడ్ వెర్షన్..
రాబోయే మోడల్ Xiaomi 15 Ultra ఫోన్ కెమెరా గురించి X(ట్విట్టర్) వేదికగా పలు ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తున్నాయి. కొన్ని చైనీస్ సంస్థలు చెబుతున్నదానిని బట్టీ.. Xiaomi 15 Ultra క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 4.x జూమ్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని పలు చైనీస్ సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి. 200-మెగాపిక్సెల్ జూమ్ లెన్స్ అంటే ఇది ముమ్మాటికీ Xiaomi 14 Ultraకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గానే చెప్పొచ్చు. అలాగే, నాలుగు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో సహా క్వాడ్ కెమెరా యూనిట్‌ను అందిస్తున్నారు. ముఖ్యంగా 50-మెగాపిక్సెల్ Sony LYT900 కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)ని కలిగి ఉంది. 3.2x ఆప్టికల్ జూమ్ మరియు 5x ఆప్టికల్ జూమ్‌తో మరో రెండు 50-మెగాపిక్సెల్ Sony IMX858 సెన్సార్లు అందిస్తున్నారు. నాలుగవ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వస్తుంది. ముందు భాగంలో ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది.
Xiaomi 14 ఫీచర్స్‌తో పోలిక..
14 Ultraతోపాటే రిలీజ్ అయిన మోడల్ Xiaomi 14. ఈ స్మార్ట్ ఫోన్ 6.36 అంగుళాల 1.5K ఓఎల్‌ఈడీ ఎల్‌టీపీఓ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో వచ్చిన ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తోంది. దీనికి Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOSతో పనిచేస్తూ.. డ్యూయల్ సిమ్ కార్డుకు అవకాశం కల్పించారు. మొబైల్ వెనుక వైపున 50 MP ఓఐఎస్ కెమెరా, 50 MP అల్ట్రావైడ్, 50 MP టెలిఫొటో లెన్స్‌ను అందించారు. ముందువైపు 32 MP కెమెరా రూపొందించారు. 4,610 mAh బ్యాటరీ సామర్థ్యంతో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా కలిగి ఉంది. ఐపీ68 రేటింగ్, వైఫై 7, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను అందించారు. మార్కెట్‌లో 12GB+ 512GB వేరియంట్ ధర రూ.69,999గా ఉంది.
Snapdragon 8 Gen 4 ప్రాసెసర్..
Xiaomi 14 Ultra Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఆధారంగా Xiaomi 15 Ultra Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, Xiaomi Ultra 15ను 2025 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో మన దేశంలో విడుదలైన Xiaomi 14 Ultra 16GB RAMతో 512GB స్టోరేజీ సామర్థ్యం ఉన్న వేరియంట్ ధర రూ. 99,999గా ఉన్న విషయం తెలిసిందే.