YouTube recently announced a crackdown on those using VPN to get a cheaper subscription
మన దేశంలోని YouTube Premium సబ్‌స్క్రైబర్‌లకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. తాజాగా యాడ్ ఫ్రీ కంటేంట్ కోరుకునేవారికి ధరల మోత మోగించింది. ఈ నిర్ణయంతో వ్యక్తిగత, విద్యార్థి, కుటుంబంతో సహా అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలూ పెరిగిపోయాయి. కొన్ని ప్లాన్‌లకు పెంపు తక్కువగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం వాటి అసలు ధరల కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే టారిఫ్ చార్జీలు పెరగడంతో అయోమయంలో ఉన్న వినియోగదారులు తాజాగా YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ప్రీమియం ప్లాన్స్ ధరలు పెంచడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజానికి, YouTube Premiumతో సబ్‌స్క్రైబర్‌లు YouTube వీడియోలను యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్, హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాలను పొందుతారు.
ప్రతి ఏటా YouTube సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు పెంచడం, తగ్గించడం సాధారణం. అయితే, ఈసారి మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి ఇది షాక్ అనే చెప్పాలి. ఈ పెరిగిన కొత్త YouTube Premium ధరలు ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నిజానికి, ఇది ప్రీపెయిడ్ అలాగే, రికరింగ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రభావితం చేస్తుంది. వ్యక్తిగత చందాదారుకు YouTube Premium కంటెంట్‌ను ప్రసారం చేయడానికి నెలకు మునుపటి ధర రూ. 129తో పోల్చితే ఇప్పుడు రూ. 149గా నిర్ణయించారు. అలాగే, ఫ్యామిలీ ప్లాన్‌ని ఎంచుకున్న వినియోగదారులు ఇప్పుడు నెలకు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. ఐదుగురు వినియోగదారుల వరకు యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్‌ను అందించే ఈ ప్లాన్ గతంలో రూ. 189గా ఉండేది. అన్ని రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు కూడా అదేవిధంగా సవరించబడ్డాయి. ఇప్పటికే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.
తాజాగా ధరల పెంపు తర్వాత కూడా YouTube Premium యొక్క స్టూడెంట్ ప్లాన్ యాడ్-ఫ్రీ వీడియోలను చూడటానికి చౌకైన ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఈ ప్లాన్ ధర పెరిగినప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, గతంలో నెలకు రూ. 79గా ఉన్న ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 89 అయ్యింది. అంటే కేవలం పది రూపాయల పెరుగుదల మాత్రమే కనిపిస్తోంది. ఇది ఒక విధంగా విద్యార్థులకు ఉపయోగకరమనే చెప్పాలి.
యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల పాత-కొత్త రేట్ల వివరాల ఇవే..
నెలవారి వ్యక్తిగత ప్లాన్ గతంలో రూ. 129 ఉండగా అది ఇప్పుడు రూ. 149కి అంటే.. రూ. 20 పెరిగింది.
నెలవారి స్టూడెంట్ ప్లాన్ రూ. 79 ఉండేది. తాజాగా రూ. 89కి అంటే.. రూ. 10 పెరిగింది.
నెలవారి ఫ్యామిలీ ప్లాన్ రూ. 189 నుంచి ఏకంగా రూ.299కి అంటే.. రూ. 110 పెరిగింది.
ప్రీపెయిడ్ నెలవారి వ్యక్తిగత ప్లాన్ రూ. 139 ఉండగా రూ. 159కి అంటే.. రూ. 20 పెరిగింది.
ప్రీపెయిడ్ త్రైమాసిక వ్యక్తిగత ప్లాన్ గంతో రూ. 399గా ఉంటే అది రూ. 459కి అంటే.. రూ. 60 పెరిగింది.
ప్రీపెయిడ్ వార్షిక వ్యక్తిగత ప్లాన్ రూ. 1,290 ఉండగా రూ. 1,490కి అంటే.. రూ. 200 పెరిగింది.
ఇక కొత్త వినియోగదారులు స్ట్రీమింగ్ సర్వీస్‌లో నమోదు చేసుకునే ముందు YouTube Premium యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. ముందుగా వ్యక్తిగత, విద్యార్థి, కుటుంబం ఎంపిక తర్వాత YouTube ప్రీమియం ప్లాన్ నుంచి ఒక నెల ట్రయల్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత YouTube ప్రీమియం కోసం సవరించిన ధరలను చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా YouTube Premium సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఏ ప్లాన్‌ను ఎంచుకుంటారో ఆలోచించుకోండి!
ప్రకటన
ప్రకటన