యాపిల్ ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌తో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి యాపిల్ కసరత్తు చేస్తోంది.
ఫోన్ తెరిస్తే ఐప్యాడ్.. మూస్తే ఐఫోన్..!
యాపిల్ ఎప్పుడూ కాస్త ఆలస్యంగానే వస్తుంది కానీ, వచ్చేటప్పుడు మాత్రం అదిరిపోయే ప్లాన్‌తో వస్తుంది. ఇప్పుడు కూడా సరిగ్గా అదే జరుగుతోంది. టెక్ ప్రపంచంలో ఎప్పటినుంచో వినిపిస్తున్న 'ఐఫోన్ ఫోల్డ్' ముచ్చట 2026లో నిజం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌తో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి యాపిల్ కసరత్తు చేస్తోంది. సామ్సంగ్, గూగుల్ వంటి బ్రాండ్స్ ఇప్పటికే ఈ విభాగంలో పాగా వేసినప్పటికీ, యాపిల్ తనదైన శైలిలో ఐప్యాడ్ ఫీచర్లను ఫోన్లోకి తీసుకొస్తూ ఒక కొత్త హైబ్రిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఈ ఫోన్ కేవలం మడతపెట్టే స్క్రీన్ మాత్రమే కాదు, మన వాడకపు తీరునే మార్చేసేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఐఫోన్ ఫోల్డ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దాని యూజర్ ఇంటర్‌ఫేస్ గురించి. బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌ను అన్‌ఫోల్డ్ చేసినప్పుడు అది అచ్చం ఐప్యాడ్ లాగా మారుతుందట. ప్రస్తుతం మనం ఐఫోన్లలో ఒకేసారి రెండు యాప్స్ వాడలేము, కేవలం వీడియోలు చూసేటప్పుడు పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో మాత్రం స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ద్వారా పక్కపక్కనే రెండు యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు. దీనివల్ల మల్టీటాస్కింగ్ చాలా సులభం అవుతుంది. ఐప్యాడ్‌లో ఉండే సైడ్‌బార్ ఫీచర్ కూడా ఇందులో ఉండబోతోంది కాబట్టి, యాప్స్ మధ్య స్విచ్ అవ్వడం మరింత ఈజీగా ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే, ఇది ఒక ఐఫోన్, ఐప్యాడ్ మినీల కలయికలా కనిపిస్తుంది. ఫోన్ మూసి ఉన్నప్పుడు ఒక మామూలు ఐఫోన్‌లా ఉండి, తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ అంత స్క్రీన్‌ను అందిస్తుంది. దీనిని యాపిల్ 4:3 ఆస్పెక్ట్ రేషియోతో రూపొందిస్తున్నట్లు సమాచారం. అంటే ఇది చూడటానికి గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ తరహాలో కొంచెం వెడల్పుగా ఉండవచ్చు. దీని లోపలి స్క్రీన్ దాదాపు 7.8 అంగుళాలు, బయటి స్క్రీన్ 5.5 అంగుళాల వరకు ఉండే అవకాశం ఉంది. సామ్సంగ్ తన ఫోల్డ్ ఫోన్ల పరిమాణంలో మార్పులు చేస్తున్న తరుణంలో, యాపిల్ ఈ వెడల్పాటి డిజైన్‌తో మార్కెట్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.
ఈ ఫోన్ నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్‌ను చూపించబోతోంది. ఇందులో సరికొత్త ఏ20 ప్రో చిప్‌సెట్‌ను వాడతారని టాక్. ఇది అత్యంత వేగవంతమైన 2ఎన్ఎమ్ నోడ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. దీంతో గేమింగ్ గానీ, హెవీ టాస్క్స్ గానీ వెన్నపూసలా జరిగిపోతాయి. కనెక్టివిటీ కోసం యాపిల్ సొంతంగా తయారు చేసుకున్న సి2 మోడెమ్‌ను ఉపయోగించబోతున్నారు. కెమెరాల విషయానికి వస్తే, ముందు వైపు రెండు, వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఐఫోన్లకు ఉండే ఫేస్ ఐడీకి బదులుగా, ఈ ఫోల్డబుల్ మోడల్‌లో పవర్ బటన్‌కే టచ్ ఐడీని అమర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యాపిల్ డెవలపర్ల కోసం ప్రత్యేకమైన టూల్స్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ఎందుకంటే సాధారణ ఐఫోన్ యాప్స్ ఈ పెద్ద స్క్రీన్‌పై సరిగ్గా కనిపించవు. అందుకే యాప్ డెవలపర్లు తమ అప్లికేషన్లను ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌కు తగ్గట్టుగా రీ-డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రెండింటినీ పక్కాగా బ్యాలెన్స్ చేయడం వల్లే యాపిల్ డివైజ్‌లు అంత స్మూత్‌గా పనిచేస్తాయి. ఇప్పటికే చాలా మంది ఐప్యాడ్ మినీని తమ సెకండరీ డివైజ్‌గా వాడుతున్నారు, ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ నేరుగా ఫోన్లోనే దొరికితే యూజర్లకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ఇది కచ్చితంగా యాపిల్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద ట్రీట్ అనే చెప్పాలి.
మొత్తానికి 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వరూపమే మారిపోయేలా ఉంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాలన్నీ చూస్తుంటే యాపిల్ కేవలం ఫోల్డబుల్ ట్రెండ్‌ను ఫాలో అవ్వడమే కాకుండా, తనదైన మార్కును వేయాలని చూస్తోంది. ఫోల్డ్ చేయగలిగే ఫ్లెక్సిబిలిటీతో పాటు ఐప్యాడ్ స్థాయి పర్ఫార్మెన్స్ ఒకే చోట దొరికితే దీని ధర కూడా భారీగానే ఉండవచ్చు. అయినప్పటికీ కొత్తదనాన్ని కోరుకునే వారికి, ప్రొఫెషనల్ వర్క్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. ఈ గ్యాడ్జెట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ రాబోయే రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. సో, టెక్ లవర్స్ అందరూ 2026 కోసం వెయిట్ చేయాల్సిందే.
ప్రకటన
ప్రకటన