Photo Credit: NASA
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకున్న ఇద్దరు US వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ల విషయంలో NASA ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. మొదట ఎనిమిది రోజుల మిషన్ కోసం ఈ యాత్ర షెడ్యూల్ చేయబడింది. అయితే, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా వారు తిరిగి రావడం ఆలస్యం అయింది. తాజాగా NASA చేసిన ప్రకటన ద్వారా ఆ ఇద్దరు వ్యోమగాములను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి స్పేస్ ఎక్స్ క్యాప్పూల్స్ ద్వారా తిరిగి భూమికి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇది అత్యంత సవాళ్లతో కూడుకున్న మిషన్ అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలను ధైర్యంగా ఎదుర్కొంటోన్న వారి ఆత్మస్థయిర్యాన్ని మెచ్చుకోవాలని కోరింది.
నిజానికి, వ్యోమగాములను బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమికి తరలించాల్సి ఉంది. అయితే, ISSకి చేరుకునే సమయంలోనే స్టార్‌లైనర్ అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. వీటిలో ప్రధానంగా హీలియం లీక్‌తోపాటు కీ థ్రస్టర్‌లలో వైఫల్యాలు ఉన్నాయి. దీంతో NASA మరింత డేటా సేకరణ కోసం అంతరిక్ష నౌకను భూమికి తిరిగి వచ్చేలా చేసింది. NASA, బోయింగ్ మధ్య చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా NASA భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది. అయితే, స్టార్‌లైనర్ ఆశించిన రీతిలో పనితీరు కనబరచడంలో వైఫల్యం చెందడంతో బోయింగ్ అంతరిక్ష సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైఫల్యాలు వెలుగులోకి రావడం వాణిజ్య విమానాల విభాగంలో కొనసాగుతున్న బోయింగ్‌కు తలనొప్పిగా మారింది.
స్టార్‌లైనర్ సమస్యలకు పరిస్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌లను తిరిగి సురక్షితంగా భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎలోన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్రాఫ్ట్‌పై ఆధారపడాలని NASA నిర్ణయించింది. అంతవరకూ వ్యోమగాములు ISSలోనే ఉంటారు. వారు తిరిగి వచ్చే వరకు తమ సిబ్బందితో కలిసి పనిని కొనసాగిస్తారని NASA తెలిపింది. విలియమ్స్, విల్మోర్ ఇద్దరికీ అంతరిక్షంలో ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసునని, రోబోటిక్స్‌లో విస్తృత అనుభవజ్ఞులైన వ్యోమగాములని వెల్లడించింది. పొడిగించిన ఈ మిషన్‌కు వారిద్దరూ బాగా సరిపోతారని అభిప్రాయపడింది. ఈ విషయంలో స్పేస్‌ఎక్స్ NASAకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించింది.
గత ఏడాది జూన్‌లో ఎనిమిది రోజుల కోసం ప్రారంభించిన ఈ మిషన్ నేటికీ కొనసాగుతోంది. అయితే, ఈ మిషన్‌లో ఉన్న వ్యోమగాములు భౌతికంగా, మానసికంగా అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్పేస్ రేడియేషన్, ఐసోలేషన్, మైక్రోగ్రావిటీకి ఎక్కువసేపు గురికావడం వల్ల భౌతికంగా కలిగే నష్టం భారీగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ISS ఈ ప్రమాదాల నుండి కొంత రక్షణను అందిస్తుంది. అంతేకాదు, సిబ్బందితో కూడిన అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇదో ఉదాహరణగా భావించవచ్చు. ప్రత్యేకించి ఈ సవాళ్లు చంద్రుడు, అంగారక గ్రహాలకు మరింత ప్రతిష్టాత్మకమైన మిషన్‌ల వైపు దృష్టి మళ్లేలా చేస్తుంది.
ప్రకటన
ప్రకటన