Photo Credit: Ministry of Railways
భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్వరైల్ పేరుతో ఓ సరికొత్త సూపర్ యాప్‌ను ప్రారంభించింది. రిజర్వ్ టికెట్ బుకింగ్, రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడం, PNR ఎంక్వైరీలు వంటి పబ్లిక్ ఫేసింగ్ సర్వీసులు అందించేందుకు ఇది వన్-స్టాప్ షాప్‌గా పరిచయం చేయబడింది. ప్రస్తుతం బీటాలో Android, iOS ప్లాట్‌ఫారమ్‌లకు మాత్రమే పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంది. స్వరైల్ సూపర్ యాప్ ద్వారా ప్రస్తుతం ఫోన్‌లో రైల్వే సేవల కోసం వినియోగిస్తున్న అనేక యాప్‌ల అవసరం లేకుండా, అన్ని సర్వీసులూ ఒకే చోట అందించడమే లక్ష్యంగా దీనిని రైల్వే శాఖ పరిచయం చేసింది.
ఈ స్వరైల్ సూపర్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) డెవలప్ చేసింది. ఇది వన్-స్టాప్ సొల్యూషన్‌గా పనిచేస్తూ, భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని యాప్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకు వస్తుంది. స్వరైల్ సూపర్ యాప్‌తో భారతదేశంలోని రైలు వినియోగదారులు రిజర్వ్, అన్‌రిజర్వ్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్లను సైతం బుక్ చేసుకోవచ్చు. అలాగే, పార్శిల్, సరుకుల రవాణా డెలివరీల గురించి ట్రాక్ చేయవచ్చు. రైలు, PNR స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. అంతే కాదు, రైళ్లలో ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదులు, ప్రశ్నల కోసం Rail Madad ను సంప్రదించవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం, భారతీయ రైల్వే టికెట్ బుకింగ్, రైలు రన్నింగ్ స్టేటస్, షెడ్యూల్ వంటి సేవల నిమిత్తం వివిధ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ స్వరైల్ సూపర్ యాప్ అనేది అన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్లాట్‌ఫామ్‌గా చెప్పొచ్చు. ఇది పైన పేర్కొన్న సేవలను స్మార్ట్ ఫోన్‌ల నుండి నేరుగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ స్వరైల్ సూపర్ యాప్‌లో రైల్వేకు సంబంధించిన వివిద కేటగిరీల సమాచారాన్ని అందించేందుకు సహాయపడుతుంది.
ఉదాహరణకు, ఈ యాప్‌లో PNR స్టేటస్‌తోపాటు రైలుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకేసారి తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇది సింగిల్ సైన్-ఆన్ ఫంక్షణాలిటీని అందిస్తుంది. వినియోగదారులు ఒకే లాగిన్‌తో అన్ని సర్వీసులనూ యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అంతేకాదు, దీనిని IRCTC రైల్‌కనెక్ట్, UTS మొబైల్ యాప్ వంటి ఇతర భారతీయ రైల్వే యాప్‌లలో కూడా ఉపయోగించవచ్చు.
అలాగే, యాప్‌లోకి లాగ్ ఇన్ అయ్యేందుకు వినియోగదారులు తమ ప్రస్తుత రైల్‌కనెక్ట్ లేదా UTS యాప్ లాగిన్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది m-PIN, బయోమెట్రిక్ సహా అనేక లాగిన్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లలో బీటాలో అందుబాటులో ఉంది. అలాగే, వినియోగదారులు దీని మెరుగుదల కోసం తమ ఫీడ్‌బ్యాక్‌ను అందించడం ద్వారా అవసరమైన మార్పులు, చేర్పులను జోడించనున్నారు. అనంతరం దీనిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రకటన
ప్రకటన