Honor Magic V2 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా Honor Magic V3 పేరుతో Honor ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను చైనా మొబైల్ మార్కెట్‌లో గత నెల 12న లాంచ్ చేసింది. పుస్తకశైలిలో ఉన్న ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో Honor ఇటీవలే Magic V3ని కూడా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ Honor Magic V3లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఈ మొబైల్ కెమెరా సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫంక్షనాలిటీతో రూపొందించారు. అలాగే, 12GB + 256GB వేరియంట్ సామర్థ్యం ఉన్న మొబైల్ ధర 8,999 యువాన్లుగా చైనా మార్కెట్‌లో ఉంది. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.
1,04,000 ఉంటుంది. దీంతోపాటు 12GB + 512GB వేరియంట్ ధర చైనాలో 9,999 యువాన్లు (సుమారు రూ. 1,15,000)గా, 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ సామర్థ్యం ఉన్న ఫోన్ ధర 10,999 (సుమారు రూ. 1,27,000)గా విడుదల చేశారు. మరెందుకు ఆలస్యం Honor Magic V3 వెర్షన్‌కు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందామ?!
చైనాలో గత నెల లాంచ్ చేసిన ఈ ఫోన్ నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు మొత్తం నాలుగు రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అలాగే, కంపెనీ ప్రకటన దృష్ట్యా త్వరలో గ్లోబల్ మార్కెట్‌లలో కూడా Honor Magic V3 విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానంగా 2,344 x 2,156 పిక్సెల్ రిజల్యూషన్‌తో 7.92- అంగుళాల ప్రైమరీ FHD+ LTPO OLED డిస్‌ప్లేతో దీనిని రూపొందించారు. అంతేకాదు, 2376×1060 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.43 అంగుళాల LTPO OLED కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Honor Magic V3కి సరికొత్త స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ని అమర్చారు.
ఆకట్టుకునే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్..
Honor Magic V3 మోడల్ స్మార్ట్‌ఫోన్ 16GB LPDDR5x RAMతోపాటు 512GB UFS 4.0 స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తోంది. అలాగే, Android 14 ఆధారిత MagicOS 8.0.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై స్మార్ట్‌ఫోన్ పనిచేస్తోంది. ఇక కెమెరా స్పెఫికేసన్స్ విషయానికి వస్తే.. మొబైల్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇది నిజంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు అదనపు ఆకర్షణను అందిస్తుందనంలో సందేహమే లేదు. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా లాంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా అందించారు. సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 40-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీని సహాయంతో సరికొత్త వీడియో కాలింగ్ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఈ మొబైల్ కెమెరా సిస్టమ్‌లో AI మోషన్ సెన్సింగ్ వంటి AI ఫీచర్స్‌ను జోడించారు. ఇది కెమెరా విభాగంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సిలికాన్ కార్బన్ బ్యాటరీతో..
అంతేకాదు, 5150mAh సామర్థ్యం ఉన్న సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఈ స్మార్ట్‌ఫోన్‌కు 66W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసేలా రూపొందించారు. అలాగే, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ దీనికి మరో ప్రత్యేకత. ఫోన్ దుమ్ము ధూళీతోపాటు నీటి నుండి రక్షిణ పొందేలా ఉండేందుకు IPX8 రేటింగ్‌ను అందించారు. ఇటీవల చైనాలో విడుదల చేసిన ఈ Honor Magic V3 వెర్షన్ మోడల్ నంబర్ FCP-AN10తో ఉంది. మన దేశీయ మార్కెట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇప్పటికైతే లేదు. మరి Honor అభిమానుల మనసుదోచే ఈ మోడల్ ఇంకెలాంటి ప్రత్యేకతలతో రాబోతోందో తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే!