Photo Credit: Nothing
ప్రపంచవ్యాప్తంగా Nothing Phone 3a సిరీస్‌ను మార్చి 4న గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమైంది. అరంగేట్రానికి ముందే ఈ బ్రిటిష్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు (OEM) రాబోయే ఫోన్‌లలో ఒకదాని టీజర్‌ను షేర్ చేసింది. ఇందులో కొత్తగా బటన్‌ను అటాచ్ చేయడం స్పష్టంగా గమనించవచ్చు. ఇది ఐఫోన్ 16 మోడళ్లలోని కెమెరా కంట్రోల్ బటన్ మాదిరిగానే కెమెరాను యాక్టివేట్ చేసే క్విక్ షట్టర్‌గా ప్రచారంలో ఉంది. అంతేకాదు, కంపెనీ Nothing Phone 3a నుంచి బేస్ మోడల్‌తోపాటు ప్రోను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సరీస్‌కు సంబంధించిన కీలక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
కంపెనీ X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ప్రకారం.. ఫోన్ సైడ్ ప్రొఫైల్‌తో ఈ మోడల్‌పై ఒక అవగాహన కల్పించేలా టీజర్‌ను షేర్ చేసింది. పవర్ బటన్ కింద ఓ కొత్త బటన్‌ను అందించినట్లు ఇందులో కనిపిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, బటన్ కెమెరా కోసం అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క అంశంతో కంపెనీ వినియోగదారులలో ఒకింత ఆసక్తికరమైన చర్చకు అవకాశం కల్పించినట్లయింది.
ఇతర OEMల మాదిరిగానే Nothing కూడా అదే మార్గాన్ని అనుసరిస్తే, బటన్‌ను ఒక్కసారి నొక్కితే కెమెరా యాక్టివేట్ అవుతుంది, మళ్ళీ నొక్కితే ఫోటో తీయబడుతుంది. అయితే, Nothing అభిమానులు మాత్రం ఈ బటన్ ఇతర యాక్టివిటీలకు అనుగుణంగా రూపొందించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అలాగే, కార్ల్ పీ పూర్వ సంస్థ వన్‌ప్లస్ తయారు చేసిన పరికరాల్లో కనిపించే మాదిరిగానే ఇది అలర్ట్ స్లయిడర్ కావచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపైన కూడా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు.
అంతే కాదు, కంపెనీ ఈ సంవత్సరం కృత్రిమ మేధస్సు (AI)పై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఇది Nothing Phone 3a వాయిస్ అసిస్టెంట్‌ను ఆన్ చేసేందుకు వినియోగించే ఓ బటన్ కావచ్చని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బటన్‌పై జరుగుతోన్న ప్రచారాన్ని బట్టీ ఇది అనేక యాక్టివిటీస్‌కు ఉపయోగపడేందుకు అందించినట్లు అంచనా వేయవచ్చు. ఇప్పటికే అనేక మోడల్స్‌లో ఈ తరహా బటన్స్ వచ్చినప్పటికీ వాటి విధులకు భిన్నంగా ఇది ఉండే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
ఐఫోన్ యాక్షన్ బటన్‌తో పోల్చవచ్చు. ఇది ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచడం, ఫ్లాష్‌లైట్‌ను యాక్టివేట్ చేయడం, ఫోకస్ మోడ్‌ను మార్చడం, కెమెరాను ఓపెన్ చేయడం వంటి విభిన్న విధులను నిర్వహించడానికి అమర్చబడింది. అయితే, ఇవన్నీ పూర్తిగా ఊహాగానాలుగానే ఉన్నాయి. మార్చి 4న జరగనున్నNothing Phone 3a సిరీస్ లాంచ్‌కు ముందే దీనికి సంబంధించిన కీలక అంశాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఈ ప్రచారాలన్నీ అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన