Photo Credit: Jio
ఆర్థిక అవసరాల కోసం వన్-స్టాప్ పరిష్కారంగా JioFinance యాప్‌ను భారతదేశంలో ప్రారంభించారు. ఇది గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) చేత డెవలప్ చేయబడింది. దేశంలోని వినియోగదారుల కోసం ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాప్, UPI లావాదేవీలను నిర్వహించడం, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు మరియు పర్యవేక్షన, బిల్లు చెల్లింపులు చేయడం వంటి సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా, ఈ ఏడాది మేలో ప్రయోగాత్మకంగా JioFinance బీటాలో లాంచ్ చేసింది. ఈ JFSL ద్వారా ఇప్పటికే ఆరు మిలియన్‌ల ప్రజలు దీని సేవలను ఉపయోగించుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది.
JFSL అధికారికంగా చెబుతున్న దాని ప్రకారం.. JioFinance యాప్ Android కోసం Google Play Storeలో, iOS పరికరాల కోసం App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ప్రత్యామ్నాయంగా, దీనిని MyJio ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. అలాగే, JioFinanceతో వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్ వ్యాపారుల వద్ద QR కోడ్‌లను స్కాన్ చేసి UPI చెల్లింపులను నిర్వహించవచ్చు. అంతేకాదు, ఆన్‌లైన్ చెల్లింపులు, డబ్బును ఇతర వినియోగదారులకు పంపడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, యాప్ UPI ఇంటర్నేషనల్ ఫీచర్‌ని ఉపయోగించి విదేశీ చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. UPI IDలను తీసివేయడం, బ్యాంక్ ఖాతాలను మార్చడం వంటి వివిధ సెట్టింగ్‌లను ఈ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. వినియోగదారులకు యాప్‌లో నిర్వహించే ప్రతి UPI లావాదేవీకి రివార్డ్‌లు అందించబడతాయి.
ఇంకా, ఈ యాప్‌లో మూడు దశల్లో జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను తెరిచేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసిందని కంపెనీ పేర్కొంది. కేవలం ఐదు నిమిషాలలో డిజిటల్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను ఉపయోగించి, కస్టమర్‌లు NEFT లేదా IMPS ద్వారా నిధులను పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. అలాగే, ఫిజికల్ డెబిట్ కార్డ్‌ని కూడా పొందవచ్చు. యుటిలిటీ బిల్లు చెల్లింపులు, మొబైల్, FASTag, DTH రీఛార్జ్‌లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటి ఇతర చెల్లింపు సేవా యాప్‌ల మాదిరిగానే JioFinance కూడా పని చేస్తుంది.
ఈ యాప్‌లోని లోన్ ఆన్-చాట్ ఫీచర్‌తో వినియోగదారులు లోన్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ మరియు హోమ్ లోన్‌లతో సహా పలు రుణాలను పొందవచ్చు. ఒకేసారి పూర్తి మొత్తానికి కాకుండా వినియోగించిన మొత్తానికి మాత్రమే వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని JFSL స్పష్టం చేసింది. JioFinance యాప్ అందించే లోన్ సదుపాయం సాలరీ, MSME కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఈ యాప్ బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. వినియోగదారులు JioFinanceలో లైఫ్, హెల్త్, టూ-వీలర్, మోటార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను చెక్ చేసి పొందవచ్చు. ఈ సేవలను ఏ సిమ్ కార్డు ద్వారా అయినా కూడా పొందవచ్చు.
ప్రకటన
ప్రకటన