Photo Credit: Reuters
వొడాఫోన్ ఐడియా మూడవ ఆర్థిక త్రైమాసికంలో 4,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన బ్రాడ్‌బ్యాండ్ టవర్లను కూడా జోడించింది
భారత్‌లో వోడాఫోన్ ఐడియా (Vi) తమ 5G సేవలను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ టెలికాం ఆపరేటర్ తమ Q3 2024-25 నివేదికలో రాబోయే ప్రణాళికలను వెల్లడించింది. మొదటగా మార్చిలో 5G సేవల ముంబైలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మరో నాలుగు నగరాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2024లో Vi మొదట దేశవ్యాప్తంగా 19 సర్కిల్‌లలో 5G ఆపరేషన్‌ను ప్రారంభించింది. అయితే, ఆ సమయంలో అవి వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. అయితే, ఎయిర్‌టెల్, జియో రెండు సంస్థలూ 2022లోనే 5G సేవలను ప్రారంభించాయి.
ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి సంబంధించిన నివేదికను ప్రకటిస్తూ.. దేశంలో వాణిజ్య 5G సేవలను ప్రారంభించాలనే తమ ప్రణాళికలను Vi వెల్లడించింది. ముంబై తర్వాత, ఏప్రిల్ 2025లో బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, పాట్నాలకు తమ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ దశలో 5G కవరేజ్ అందించే ఇతర నగరాలను ఈ టెలికాం ఆపరేటర్ వెల్లడించలేదు. ఈ అంశంపై కూడా కంపెనీ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
తాము పెట్టుబడులను పెడుతున్నామని, రాబోయే త్రైమాసికాల్లో క్యాపెక్స్ విస్తరణ మరింత వేగవంతం కానున్నట్లు చెప్పుకొచ్చింది. అదే సమయంలో, కీలకమైన భౌగోళిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 5G సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కంపెనీ CEO అక్షయ మూంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 5G విస్తరణతో పాటు, గత తొమ్మిది నెలల్లో 4G వినియోగదారుల కవరేజ్‌ను వేగంగా విస్తరించినట్లు Vi చెప్పుకొచ్చింది. అలాగే, మార్చి 2024లో 1.03 బిలియన్‌ల వినియోగదారులను కవర్ చేశామని, దానిని 41 మిలియన్‌లకు విస్తరించి, డిసెంబర్ 2024 చివరి నాటికి 1.07 బిలియన్‌లకు చేరుకున్నామని కంపెనీ వెల్లడించింది.
ఈ టెలికాం ఆపరేటర్ తమ 4G సబ్‌స్క్రైబర్ బేస్‌ను Q3 FY24లో 125.6 మిలియన్‌ల నుండి Q3 FY25 చివరి నాటికి 126 మిలియన్‌లకు పెంచింది. తమ మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ డిసెంబర్ త్రైమాసికంలో 199.8 మిలియన్‌లుగా ఉందని, గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో 215.2 మిలియన్‌లుగా ఉందని, ఇది 15.4 మిలియన్‌ల తగ్గుదలను నమోదు చేసిందని ఈ నివేదికలో తెలిపింది.
Vi తమ సగటు వినియోగదారునికి ఆదాయం (ARPU) Q2లో రూ. 166 నుండి Q3లో రూ. 173కి పెంచిందని, ఇది 4.7 శాతం పెరుగుదలను సూచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే, ఈ పెరుగుదల టారిఫ్ పెంపుదల, వినియోగదారులు అధిక ధరల ప్రణాళికలను ఎంపిక చేయడం ద్వారా వచ్చినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 4,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన బ్రాడ్‌బ్యాండ్ టవర్లకు విస్తరించింది. విలీనం తర్వాత ఒకే త్రైమాసికంలో ఇది అతిపెద్ద చేరికగా కంపెనీ పేర్కొంది.
ప్రకటన
ప్రకటన