వివో తన ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ల ధరలను రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4,000 వరకు సడన్‌గా పెంచేసింది.
Vivo
Vivo : భారతదేశంలో వివో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కంపెనీ గట్టి షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా వివిధ మొబైల్ బ్రాండ్లు తమ ఫోన్ల ధరలను పెంచుకుంటూ పోతుండగా.. తాజాగా ఆ లిస్టులోకి వివో కూడా చేరిపోయింది. ప్రముఖ టిప్‌స్టర్ సంజు చౌదరి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. వివో తన ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ల ధరలను రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4,000 వరకు సడన్‌గా పెంచేసింది. ఈ కొత్త ధరలు ఇప్పటికే వివో అధికారిక వెబ్‌సైట్ లో ప్రత్యక్షమయ్యాయి.
వివో V70 ఎలైట్ కొత్త ధరల వివరాలు
వివో వి-సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వివో V70 ఎలైట్ మోడల్‌పై అత్యధికంగా ధరల పెంపు నమోదైంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ అయిన 8GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ పాత ధర రూ.54,999 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.4,000 పెరిగి రూ.58,999కి చేరుకుంది. అదేవిధంగా దీని టాప్ వేరియంట్ అయిన 12GB రామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర కూడా రూ.59,999 నుంచి రూ.63,999కి పెరిగింది. దీనితో ఈ ఫోన్ ధర దాదాపు రూ.64,000 మార్కును తాకి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌కు చేరింది.
సాధారణ వివో V70 ఫోన్ కూడా ఖరీదైనదే
ఎలైట్ మోడల్‌తో పాటు స్టాండర్డ్ వెర్షన్ అయిన వివో V70 ధరలు కూడా పెరిగాయి. దీని 8GB రామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ పాత ధర రూ.49,999 కాగా.. రూ.4,000 పెరగడంతో ఇప్పుడు దీని కొత్త ధర రూ.53,999గా మారింది. అలాగే ఇందులో 12GB రామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ మోడల్ ధర రూ.53,999 నుంచి రూ.3,000 పెరిగి రూ.56,999కి చేరింది. దీనివల్ల వివో V70 బేస్ మోడల్ కూడా ఇప్పుడు రూ.50,000 బడ్జెట్ లైన్ దాటేసి లగ్జరీ విభాగంలోకి చేరిపోయింది.
వై-సిరీస్ మిడ్-రేంజ్ ఫోన్ల రేట్లు
కేవలం ప్రీమియం ఫోన్లే కాకుండా.. బడ్జెట్, మిడ్-రేంజ్ కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేసే వివో వై-సిరీస్ ఫోన్లను కూడా కంపెనీ వదల్లేదు. వివో Y21 మోడల్‌కు చెందిన 6GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,000 పెంచారు. దీనితో దీని పాత ధర రూ.20,999 నుంచి రూ.21,999కి పెరిగింది. మరోవైపు వివో Y400 మోడల్ 8GB + 128GB వేరియంట్ ధర రూ.28,999 నుంచి రూ.31,999కి (రూ.3,000 పెంపు) పెరగ్గా.. దీని 8GB + 256GB వేరియంట్ ధర రూ.31,999 నుంచి ఏకంగా రూ.34,999 కి పెరిగింది. వై-సిరీస్‌లో ఇది అత్యంత భారీ పెంపుగా టెక్ నిపుణులు చెబుతున్నారు.
ధరల పెంపునకు అసలు కారణం ఏంటి?
ఈ విడత ధరల పెంపుపై వివో యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదా వివరణ ఇవ్వనప్పటికీ.. ఇందుకు గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌ప్రైజ్-ఫోకస్డ్ డేటా సెంటర్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనివల్ల మెమరీ వెండర్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని అటు వైపు మళ్లించడంతో స్మార్ట్‌ఫోన్లలో వాడే డీరామ్, న్యాండ్ మెమరీ కాంపోనెంట్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ కారణంగా మొబైల్ విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో వివోతో పాటు మిగిలిన బ్రాండ్లు కూడా తమ ఫోన్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రకటన
ప్రకటన