యాపిల్ ప్రియులకు ఎప్పుడూ ఒకటే ఆశ, ప్రతి కొత్త ఐఫోన్ వెర్షన్ మునుపటి కన్నా డిజైన్ పరంగా భారీ మార్పులతో వస్తుందని.
ఐఫోన్ 18 ప్రోలో బిగ్ చేంజ్
యాపిల్ ప్రియులకు ఎప్పుడూ ఒకటే ఆశ, ప్రతి కొత్త ఐఫోన్ వెర్షన్ మునుపటి కన్నా డిజైన్ పరంగా భారీ మార్పులతో వస్తుందని. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఐఫోన్ 18 సిరీస్ మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి రానుంది. దీనితో పాటు సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కూడా పరిచయం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త సిరీస్ గత ఏడాది వచ్చిన ఐఫోన్ 17 ప్రో మోడల్స్ మాదిరిగానే కొన్ని ఫీచర్లను కొనసాగించినప్పటికీ, డిస్ప్లే విషయంలో కీలకమైన మార్పులకు యాపిల్ శ్రీకారం చుట్టనుంది. ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో మోడల్ పై టెక్ దిగ్గజం ఇప్పటికే అనేక ప్రయోగాలు చేస్తోంది.
ప్రస్తుతానికి విభిన్నమైన డిస్ప్లే డిజైన్లతో యాపిల్ సంస్థ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒక రకం పాత ఐఫోన్ల మాదిరిగానే ఉంటే, రెండో రకం మాత్రం 'మినీ డైనమిక్ ఐలాండ్' అనే కొత్త కాన్సెప్ట్ తో రాబోతోంది. ఫేస్ ఐడీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సెన్సార్లను స్క్రీన్ అడుగు భాగానికి మార్చడం వల్ల ఈ మార్పు సాధ్యమవుతుంది. ఇలా చేయడం ద్వారా డిస్ప్లే పై ఉండే ఆ నల్లటి పిల్ ఆకారం భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో తో పోలిస్తే ఐఫోన్ 18 ప్రో లోని ఈ డైనమిక్ ఐలాండ్ దాదాపు 35 శాతం చిన్నదిగా మారే ఛాన్స్ ఉంది.
చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల మేరకు, యాపిల్ ప్రస్తుతం ఎ/బి టెస్టింగ్ (A/B testing) ప్రక్రియలో నిమగ్నమై ఉంది. అంటే రెండు విభిన్న డిజైన్లను పోల్చి చూస్తూ ఏది వినియోగదారులకు మెరుగ్గా ఉంటుందో అని పరిశీలిస్తోంది. ఒకవేళ పాత డిజైన్ నే కొనసాగించాలని కంపెనీ నిర్ణయించుకుంటే మాత్రం ఈ కొత్త డైనమిక్ ఐలాండ్ అప్‌గ్రేడ్ ప్రస్తుతానికి ఆగిపోవచ్చు. వినియోగదారులు ఆశించే ఆ భారీ మార్పు ఫోన్ ముందు భాగంలో కనిపించకపోవచ్చు. ఈ నిర్ణయం పూర్తిగా యాపిల్ టెస్టింగ్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.
ఫోన్ వెనుక వైపు కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, అక్కడ పెద్దగా ఆశ్చర్యపరిచే మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని తరాలుగా వస్తున్న ఆ చతురస్రాకారపు కెమెరా డిజైన్ ఐఫోన్ 18 ప్రో లో కూడా కొనసాగనుంది. ఐతే కెమెరా మాడ్యూల్ ఫినిషింగ్, వాడే మెటీరియల్స్ విషయంలో కొన్ని చిన్నపాటి మెరుగులు దిద్దే అవకాశం ఉంది. హ్యాండ్‌సెట్ పట్టుకున్నప్పుడు మరింత ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా యాపిల్ ప్లాన్ చేస్తోంది. అలాగే ఈసారి కొత్త రంగుల్లో కూడా ఐఫోన్లను ప్రవేశపెట్టే ఆలోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మన్ చెప్పిన మాటలకు తాజా లీకులు బలం చేకూరుస్తున్నాయి. ఐఫోన్ 18 ప్రో మోడల్స్ లో డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించేలా చేయాలని యాపిల్ భావిస్తోంది. 2022లో ఐఫోన్ 14 ప్రో తో మొదలైన ఈ డైనమిక్ ఐలాండ్ ప్రయాణం, నాచ్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఒక విప్లవాత్మక మార్పుగా నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిమాణంలో కొంచెం తగ్గుతూ వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం అది కంటికి కనిపించేలా గణనీయంగా చిన్నదిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
సంఖ్యల పరంగా చూస్తే ఐఫోన్ 17 ప్రో లో 20.7 మిల్లీమీటర్లుగా ఉన్న ఈ డైనమిక్ ఐలాండ్, కొత్త ఐఫోన్ 18 ప్రో మోడల్స్ లో కేవలం 13.49 మిల్లీమీటర్లకు పరిమితం కావచ్చు. హార్డ్‌వేర్ పరంగా లోపల అనేక మార్పులు చేస్తున్నా, బయట డిజైన్ లో కూడా స్పష్టమైన వ్యత్యాసం చూపించాలనేది యాపిల్ లక్ష్యం. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో పోటీ పెరగడంతో ఇలాంటి చిన్న మార్పులు కూడా ఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపిస్తాయి. కొత్త టెక్నాలజీతో పాటు ఆకర్షణీయమైన రూపం ఐఫోన్ 18 ప్రో కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన