భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అత్యున్నత భద్రతా ఏజెన్సీలు స్టార్‌లింక్ సర్వీసులకు తుది అనుమతి ఇవ్వకుండా ప్రస్తుతానికి నిలిపివేశాయి.
Elon Musk
Elon Musk : స్పేస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రముఖ అమెరికన్ కంపెనీ స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం మరింత ఆలస్యం కాబోతోంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ సంస్థ.. గత కొన్ని నెలలుగా భారతదేశంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఎదురవుతున్న కొన్ని భద్రతా పరమైన ఆందోళనల కారణంగా ఈ ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం నుండి తుది అనుమతులు లభించడంలో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అత్యున్నత భద్రతా ఏజెన్సీలు స్టార్‌లింక్ సర్వీసులకు తుది అనుమతి ఇవ్వకుండా ప్రస్తుతానికి నిలిపివేశాయి. మిడిల్ ఈస్ట్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం, అక్కడ స్టార్‌లింక్ శాటిలైట్ టెర్మినల్స్ వినియోగంపై వచ్చిన కొన్ని నివేదికలే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ దేశంలో స్టార్‌లింక్‌కు ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకపోయినప్పటికీ, అక్కడ ఈ శాటిలైట్ టెర్మినల్స్ అక్రమంగా వినియోగంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భౌగోళిక-రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు ఈ అమెరికన్ కంపెనీని నియంత్రించే సామర్థ్యం స్థానిక ప్రభుత్వాలకు ఉంటుందా లేదా అనే అనుమానాలు మన ఏజెన్సీల్లో వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీకి దాదాపు ఒక సంవత్సరం క్రితమే భారత ప్రభుత్వం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్(GMPCS) లైసెన్స్‌ను మంజూరు చేసింది. అయితే ఈ లైసెన్స్ కేవలం కంపెనీ తన అంతర్గత పనులను సిద్ధం చేసుకోవడానికి, ఇతర సంస్థలతో ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. భారతదేశంలో కమర్షియల్‌గా ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలంటే స్టార్‌లింక్ సంస్థ అదనపు రెగ్యులేటరీ, కఠినమైన సెక్యూరిటీ క్లియరెన్స్‌లను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన అధికారులు ఈ సెక్యూరిటీ నిబంధనలను చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు.
Samsung Galaxy A57 5G : రూ.50 వేల బడ్జెట్‌లో ఆల్‌రౌండర్ ఫోన్.. ప్రీమియం ఫీచర్లతో శామ్‌సంగ్ సరికొత్త స్కెచ్
భారతదేశంలో స్టార్‌లింక్ అనుమతులు ఆలస్యం కావడం ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే స్పేస్ఎక్స్ కంపెనీ త్వరలోనే తన ప్రతిష్టాత్మక ఐపీవోను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది, దీనికి సంబంధించిన ప్రైసింగ్ వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో స్టార్‌లింక్‌కు క్లియరెన్స్ లభించకపోవడం ఈ ఐపీఓపై ఆర్థికంగా కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), స్టార్‌లింక్ మధ్య ఒక కీలకమైన వ్యాపార భాగస్వామ్యం కుదిరే అవకాశం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి, కొండ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్‌ను పూర్తి చేయడానికి బీఎస్ఎన్ఎల్ ఈ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని చూస్తోంది. రెండు కంపెనీల ఉన్నతాధికారుల మధ్య ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లకు సేవలు అందించే విషయంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి తప్ప ఎలాంటి అధికారిక ఒప్పందాలు ఇంకా జరగలేదు. ఇప్పుడు భద్రతా అనుమతుల వ్యవహారం తేలితేనే ఈ పొత్తు ముందుకు సాగే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy A27 5G Listing on Czech Website Leaves Little to the Imagination Ahead of Imminent Debut