గగన్ అంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ అని అర్థం. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కలిసి సంయుక్తంగా తయారు చేశాయి.
Photo Credit: AI Generated
IndiGo
GAGAN : భారతదేశ ఏవియేషన్ రంగంలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకి చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యంత సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఈ ల్యాండింగ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా విమానాలు రన్‌వేపై దిగడానికి భూమిపై ఉండే ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్(ILS) సహాయం తీసుకుంటాయి. కానీ, ఈ విమానం మాత్రం మన దేశ సొంత శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ గగన్ సహాయంతో రన్‌వేపై విజయవంతంగా దిగింది. భారతదేశంలో ఇలాంటి సరికొత్త టెక్నాలజీతో ల్యాండ్ అయిన మొదటి కమర్షియల్ జెట్ విమానంగా ఇండిగో రికార్డు సృష్టించింది.
అసలు ఏంటి ఈ గగన్ సిస్టమ్?
గగన్ అంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ అని అర్థం. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కలిసి సంయుక్తంగా తయారు చేశాయి. ఇది మనం ఫోన్లలో వాడే సాధారణ జీపీఎస్‌కు ప్రత్యామ్నాయం కాదు, కానీ జీపీఎస్ ఇచ్చే సిగ్నల్స్ ఖచ్చితత్వాన్ని వంద రెట్లు పెంచే ఒక అద్భుతమైన సపోర్టింగ్ సిస్టమ్. సాధారణంగా జీపీఎస్ సిగ్నల్స్ అంతరిక్షం నుంచి భూమికి వచ్చేటప్పుడు వాతావరణంలో జరిగే మార్పుల వల్ల కొన్ని తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. గగన్ సిస్టమ్ ఆ తప్పులను క్షణాల్లో గుర్తిస్తూ, విమానానికి వంద శాతం కరెక్ట్ లొకేషన్ డేటాను అందిస్తుంది.
ఇండిగో విమానం ఎలా ల్యాండ్ అయింది?
ఈ సరికొత్త నావిగేషన్ సిస్టమ్ పనిచేయడం వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రెఫరెన్స్ స్టేషన్లు జీపీఎస్ సిగ్నల్స్ నిరంతరం గమనిస్తూ ఉంటాయి. వాటిలో ఏవైనా తేడాలు వస్తే వెంటనే కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందిస్తాయి. అక్కడి నుంచి ఈ డేటా ఇస్రోకు చెందిన జీశాట్ ఉపగ్రహాలకు వెళ్తుంది. ఈ ఉపగ్రహాలు నేరుగా విమానంలోని పైలట్ స్క్రీన్‌కు కరెక్ట్ సమాచారాన్ని పంపుతాయి. దీనివల్ల రన్‌వే ఎక్కడుంది, విమానం ఏ యాంగిల్‌లో వెళ్తోంది అనే పూర్తి హారిజాంటల్, వర్టికల్ గైడెన్స్ పైలట్‌కు లభిస్తుంది. ఫలితంగా దట్టమైన పొగమంచు లేదా వర్షం కారణంగా రన్‌వే సరిగ్గా కనిపించని స్థితిలో కూడా పైలట్ చాలా ఈజీగా విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు.
ఆన్‌లైన్ భద్రత, అలర్ట్ సిస్టమ్
గగన్ సిస్టమ్‌లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఇంటిగ్రిటీ మానిటరింగ్ సిస్టమ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఒకవేళ వాతావరణం బాగా లేకపోవడం వల్ల లేదా మరేదైనా సాంకేతిక కారణాల వల్ల శాటిలైట్ సిగ్నల్స్‌లో ఏమాత్రం తేడా వచ్చినా.. ఈ సిస్టమ్ కేవలం కొన్ని సెకన్లలోనే పైలట్‌కు హెచ్చరిక పంపుతుంది. దీనివల్ల ప్రమాదాలను ముందే పసిగట్టి, పైలట్ ల్యాండింగ్‌ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
UPI : ఇకపై నోటితో చెబితే చాలు యూపీఐ పేమెంట్స్ సక్సెస్.. రిమోట్ లాగా వాడేయొచ్చు
చిన్న పట్టణాల ఎయిర్‌పోర్టులకు పెను వరం
ప్రస్తుతం విమానాశ్రయాలలో వాడుతున్న సాంప్రదాయ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS)ను ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయల ఖర్చుతో కూడిన భారీ గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరమవుతుంది. అందుకే దేశంలోని చాలా చిన్న నగరాలు, టౌన్లలో ఉండే రీజినల్ ఎయిర్‌పోర్టులలో ఈ సదుపాయం ఉండదు. అక్కడ వాతావరణం ఖరాబైతే విమానాలను ల్యాండ్ చేయడం కుదరదు. కానీ గగన్ టెక్నాలజీకి భూమిపై ఎలాంటి ఖరీదైన పరికరాలు అవసరం లేదు. కేవలం శాటిలైట్ సాయంతోనే చిన్న ఎయిర్‌పోర్టులలో కూడా విమానాలను సేఫ్‌గా ల్యాండ్ చేయవచ్చు.
భారతదేశానికి దక్కిన గొప్ప విజయం
ఇప్పటివరకు గగన్ టెక్నాలజీని కేవలం చిన్న చిన్న ట్రయల్ విమానాలపై మాత్రమే పరీక్షించారు. కానీ మొదటిసారిగా వందలాది మంది ప్రయాణించే భారీ కమర్షియల్ ఎయిర్‌బస్ ఏ320 జెట్ విమానాన్ని ఈ సిస్టమ్ ద్వారా ల్యాండ్ చేయడం భారతదేశపు టెక్నాలజీ సత్తాను చాటిచెప్పింది. భవిష్యత్తులో ఈ స్వదేశీ సాంకేతికతను మరిన్ని విమానాశ్రయాలలో ఉపయోగించడం ద్వారా విమాన ప్రయాణాలు మరింత సురక్షితంగా మారడమే కాకుండా, చిన్న నగరాలకు విమాన కనెక్టివిటీ కూడా అద్భుతంగా పెరుగుతుందని నిపుణులు కొనియాడుతున్నారు.
ప్రకటన
ప్రకటన
Redmi K90 Ultra Launched With Snapdragon 8 Elite Chipset, Cooling Fan and 8,550mAh Battery: Price, Specifications